=''/>

31, డిసెంబర్ 2009, గురువారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు


కరిగే కాలాన్ని నీవు ఆపలేవు ..
జరగబోయే దాన్ని నీవు ఆపలేవు ..
ఉన్న వాటితో నీవు ఆనందించు ..
హాయగానవ్వుతూ జీవించు..
అందరికీ ఆనందాన్ని పంచు ..
కష్టాలను దైర్యముతో ఎదిరించు ..
నీకు నీవే సాటని నిరూపించు ..
కలకాలం సంతోషముగా జీవించు .
నూతన సంవత్సర శుభా కాంక్షలు

29, డిసెంబర్ 2009, మంగళవారం

కోత యంత్రం తో వరి చేను కోతలు


మా వరిచేను కోతలు పూర్తయ్యాయి .గతరెండేళ్ల నుండి కోతమిషన్ సాయం తో వరిచేలు కోస్తున్నారు .
కూలీ ఖర్చు బాగా పెరిగిపోయి చాలా మంది మిషన్ తో కోయడానికే ఇష్టపడుతున్నారు . కూలీ లు పన్నెండు మంది

రోజుకి ఒక ఎకరం కోస్తే ,మిషన్ గంటలో ఎకరం కోస్తుంది .మళ్ళీ వాళ్ళను తీసుకురావడాము ,పంపడము చేయాలి .
మిషన్ వచ్చాక ఆ గొడవలేమి ఉండడములేదు .కోసేవాడు మిషన్ తో వచ్చి కోసేసి వెళుతున్నాడు .

ఇప్పుడు కూలీ రేట్లు కూడా బాగా పెరిగి పోయాయి . ఆడవాళ్లకు నూటయాబై ,మగవాళ్లకి రెండువందల
యాబై తీసుకొంటున్నారు .మిషన్ కి ఐతే ఎకరాని కోయడానికి ఈ సంవత్సరము తొమ్మిది వందలు తీసుకొన్నారు .నిరుడు కొత్త కావడం,మిషన్లు కూడ తక్కువ వుండముతో పదిహేను వందలు తీకున్నారు .ఎక్కువగా అవితమిళనాడునుండి వచ్చాయి .ఈ సంవత్సరము కొంతమది రైతులు కలసి మిషన్లు కొన్నారు అందుకే కొద్దిగా రేటు కూడా తగ్గింది .

మిషన్ వచ్చాక మావాళ్లకు మాత్రం చాలా హాయి గాఉంటుంది .వాళ్ళు ఎంతమంది వస్తారో ,ఎప్పుడు వస్తారు అన్న టెన్షన్ లు ఏవీ ఉండటము లేదు . రెండు రోజులలో నే కోతలు అయిపోతున్నాయి .

ఇలా అన్ని పనులకు మిషన్ లు వస్తే వ్యవసాయము చేయడము తేలిక అవుతుంది . ఖర్చులు కూడా తగ్గుతాయి .

28, డిసెంబర్ 2009, సోమవారం

తేగలు


తేగలు వచ్చేసాయండి. సితాకాలము వస్తే మా ఏరియాలో బస్సులు ఆగేచోట,రోడ్లమీద తేగలు అమ్మేవారి సందడి ఎక్కువగా వుంటుంది .
పొలాలలోను, రోడ్లపక్కన తాటిచెట్లవద్ద తాటిటెంకలు అన్నీ సేకరించి వాటినిపాతర వేస్తారు .అంటే పెద్ద గొయ్యి తవ్వి దానిలోకప్పెడతారు .అవి సితాకాలము వచ్చేటప్పటికి మొలకెత్త డానికి తయారవుతాయి . వాటిని తీసి కుండలో పెట్టి కింద మంట పెట్టి కాలుస్తారు .
తేగలు అంటే చాలా మందికి చిన్నచూపు కానీ వీటిలో పీచుపదార్ధము మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది .ప్రకృతి మనకు అందించిన మంచి ఆహారము తేగ .
ఇదివరకు ఎవరిపొలాలలో వాళ్లు తాటిటెంకలను ఏరించి పాతరలు వేసేవారు .
ఇప్పుడు రైతులు కూడా కొనుక్కోవడానికి అలవాటుపడిపోయారు .

21, డిసెంబర్ 2009, సోమవారం

చెడ్డ సోమవారం .

ఈ రోజు రెండు చెడ్డ విషయాలు జరిగాయి .

ఒకటి , మా చెరుకుతోట కు నిప్పంటుకుని కాలిపోయింది . మా చెరుకుతోట

దగ్గరలో ,వేరే వాళ్ళ పొలములో తుక్కుకి నిప్పు పెడితే అదికాలి అలా అలా

మాతోట కూడా అంటుకుందంట. గాలి కూడా బాగా ఉండటముతో మంటలు

తోందరగా ఎగబాకి కాలిపోయింది . చెరుకు కొట్టే కూలీ లు నాలుగురూజులు
నుండి ఈ రోజు వస్తాము ,రేపోస్తాము .. అని చెప్పి రాలేదు .
లేకపోతె కొట్టడము అయిపోను .రైతు పరిస్తితి ఇంతే కదండీ . ఎలాగో వర్షాలు
లేకపోయినాకష్టపడి పెంచితే ,సరిగ్గా కొట్టే టైంకి కాలిపోయింది .

రెండోది , మాకు తెలిసిన కరెంట్ లైన్మన్ షాక్ కొట్టి చనిపోయాడు .వాళ్ళ నాన్న

మాపొలము వచ్చేవాడు . ఈ అబ్బాయి చాలా కష్టపడి పైకివచ్చాడు
.
మధ్య ఎవరిదో పొలము కౌలుకి తీసుకొని వాళ్ళ నాన్న తో వ్యవసాయం

కూడా చేయిస్తున్నాడు .ఆ కౌలు తీసుకొన్న పొలము లోనే ట్రాన్స్ ఫారం

బాగు చేస్తుంటే ఇదిజరిగింది.విన్న మాకు చాలా భాద కలిగింది .

18, డిసెంబర్ 2009, శుక్రవారం

సెలవలు

మాకు (అదే మా అబ్బాయికి )సమైక్యాన్ద్రా సెలవలు వచ్చాయోచ్ .అసలు వాళ్ళ బడికి సెలవలు చాలా తక్కువ గా ఇస్తారు . అలాగని అదేమీ కార్పోరేట్ స్కూల్ కాదు .మా పక్క ఊరిలోని చిన్న ప్రైవేట్ స్కూల్ . కాని పెద్ద కార్పోరేట్ స్కూల్ లాగా ఫీలవుతూ ఉంటారు . ఈ సమైక్యాన్ద్రా ఉద్యమం వచ్చాక వాళ్లకు వారం రోజులు సెలవలు ఇచ్చారు .

మా బాబు డౌట్ ఏమిటంటే ఇప్పుడు ఇన్ని రోజులు సెలవలు ఇచ్చారు కదా ,తరువాత సెలవలు తగ్గించేస్తారేమో అని . వాళ్ళకి ఇదివరకు ఇలాగే వర్షాలు ఎక్కువగా వస్తే రెండు రోజులు సెలవలిచ్చి తరువాత ఆదివారము స్కూల్ పెట్టారు . హాయిగా, వచ్చిన సెలవలు తో ఎంజాయ్ చేయకుండా ఇప్పుడు రోజూ నా బుర్ర తింటున్నాడు .సంక్రాంతికి సెలవలు మూడు రోజులే ఇస్తారేమో అని ,ఇంకా చాలా ..చాలా డౌట్ లతో.

ఈ ఉద్యమం వలన అన్నిస్కూళ్ళ పరిస్తితి ఇలాగే వుంది .ఇప్పుడు హాఫ్యార్లీ పరిక్షల రోజులు .పరీక్షలకు సిలబస్ ఇప్పుడిప్పుడే అవుతుంది .ఈ అనుకోని సెలవల వలన స్కూళ్ళ షెడ్యూళ్ళు అన్నీ మారిపోతాయి .

మాపాప విజయవాడ లో హాస్టల్ లో ఉంటుంది .వాళ్లకి ఇప్పుడు పరిక్షలు జరుగుతున్నాయి .అక్కడైతే గొడవలు ఎక్కువే జరుగుతున్నాయి కానీ వీళ్ళకి పెద్దగా సమస్య లేదంట .వీళ్ళ స్కూల్ ఎక్కడో పొలాలలో ఊరికి దూరంగా ఉంటుంది .ఎలాగో పరిక్షలు ఐపొతే తరువాత ఇంటికి పంపించేసినా పరవాలేదు .
ఈగొడవలు ఎప్పటికి అవుతాయో కాని , మేము మాత్రం సెలవలుకి కాకినాడ వచ్చాము . మాచెల్లి పిల్లల తో మావాడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు .

16, డిసెంబర్ 2009, బుధవారం

ఒవెన్ లేకుండానే బిస్కట్లు చేయడం .

*బిస్కట్లు చేయడానికి కావలసిన పదార్ధాలు .
మైదా పిండి -అరకేజీ
పంచదార -పావుకేజీ ,పొడి చేసుకోవాలి.
నెయ్యి -రెండు వందల గ్రాములు .
యాలికల పొడి కొద్దిగా
వంట సోడా -ఒక స్పూన్.
తయారు చేయు విదానం ***

ఒక పెద్ద ప్లేట్ లో మైదా పిండి ,పంచదార పొడి ,నెయ్యి ,సోడా ,యాలిక పొడి వేసి బాగా కలుపుకోవాలి .దీన్ని బాగా కలుపుకొంటే నెయ్యి పైకి తేలుతుంది .ఇప్పుడు చపాతీలు చేసుకొనే పీట మీద ఈ పిండిని వేసి చేతితో పీట అంతాసమానము గా పరుచుకొని చేతితో వత్తాలి .ఇప్పుడు మనకు కావలసిన సైజు లో గుండ్రము గా కాని ,అర్ధ చంద్రాకారము లో కాని కోసుకోవాలి .(చిన్న డబ్బాముతా ను కోయడానికి ఉపయోగించవచ్చు .)
ఇప్పుడు పాత పెనముకాని ,కుక్కరు పాన్ కాని తీసుకోని దానిలో కొద్దిగా ఇసుక వేసుకోవాలి .
దానిని స్టౌ మీద పెట్టి వేడి గా అయ్యాక దానిమీద కోసుకొన్న బిస్కట్లను ఒక సేమంది ప్లేటు లోకాని (స్టీలు ప్లేట్ ఐతే అడుగున అంటుకు పోయి సరిగారావు ),కేకు చేసుకొనే గిన్నెలో కాని అడుగున నెయ్యి రాసి వాటిని జాగర్తగా పెట్టుకొని మూత పెట్టుకోవాలి .చిన్న మంట మీద వేగనివ్వాలి .అడుగున కొద్ది గా ఎరుపు రంగు వస్తే వేగి పోయినట్టే .

15, డిసెంబర్ 2009, మంగళవారం

విష్ణువుకి ప్రియం ధనుర్మాసం .సంక్రాంతి నెల ఆరంభం .

భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది "ధనుర్మాసము" . ఈమాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ , అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది .ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనేవిషయం మనకుపురాణాల ద్వారా తెలుస్తుంది .
ఆమె " తిరుప్పావై పాసురాలు" జగద్విక్యాతి నార్జించాయి .దీనిలో తిరు అంటే మంగళ కరమైన అని ,పావై అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది .వేదాంత పరమైన ఎన్నో రహస్యాలు ఈ పాశురాలలో మిళితం చేసినందున భాగవతానికి సమన్వయము చెస్తూ వస్తారు .
ధనుర్మాసం అంటే
ధనుస్సుఅనే పదానికి ..ధర్మం అని అర్ధం .అంటే ఈధనుర్మాసము లో దర్మాని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనము ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమన మాట .
ధనుస్సు మాసాల రిత్యా మార్గశిర మాసము లో వస్తుంది . ధనుర్మాసానికి ఆద్యురాలు గోదాదేవి ."గో "అనే శబ్దానికి జ్ఞానము అని ,"ద" అనే శబ్దానికి అర్ధం ఇచ్చునది అని .గోదాదేవి చెప్పిన పాసురాలను ధనుర్మాసము లో విష్ణాలయాలలో తప్పనిసరిగా గానము చేస్తారు .
ప్రతీ ధనుర్మాసము లోను గోదాదేవి గోపికలను లేపి శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని వర్ణించడం ఆ పాసురాల విశేషం .
ధనుర్మాసం అరంబాన్నే పల్లెటూర్లలొ "సంక్రాంతి "నెల పట్టడము అంటారు .ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతొ,జంగమ దేవర లతో ,గంగిరెద్దుల ను ఆడించేవారితోనూ ,సందడిగా వుంటుంది .
ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాలముగ్గుల తో కనుల విందు గా వుంటాయి .ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతు ల సంభారాలతో పల్లెలు "సంక్రాంతి "పండుగ కోసం యెదురుచూస్తూ వుంటాయి .

11, డిసెంబర్ 2009, శుక్రవారం

ఒకటికాదు పదకొండు.

సోనియా అమ్మ తెలంగాణాకి సైఅనగానే , మారాష్ట్రాలను కుడా విడదీయన్డి అని మిగిలిన రాష్ర్టాలు కూడా గొడవలు మొదలు పెడతాయి .
వెస్ట్బెంగాల్ లో గుర్కాలాండ్ ను విడయాలని వాళ్లు మొదలు పెడుతున్నారట .
బుందేల్ ఖండ్ -మధ్యప్రదేశ్ .
హరితప్రదేశ్ -ఉత్తరప్రదేశ్
మిదిలాన్చల్ -బీహార్
కూర్గ్ -కర్నాటక
భోజ్పూర్ -ఉత్తరప్రదేశ్ బిహార్ల మద్య
విదర్బ -మహారాష్ట్ర
తమిళనాడు కుడా దక్షిణ తమిళనాడు ని విదదీయమని అంటుంది .ఇంకా ఉన్నాయంట .
ఇలా రాష్ట్రాలు ప్రత్యేకరాష్ట్రాల కోసం డిమాండ్ చేయడం మొదలు పెడతాయి .వాళ్ళకి తెలంగానే స్పూర్తి అంట .
ఇప్పటికే తెలంగాణ ఇస్తామని తప్పు చేసామేమో అని తల పట్టుకొన్నారు .ఇక వాళ్లు కుడా మొదలు పెడితే అప్పుడు ఉంటుంది,సోనియా పని ...............

10, డిసెంబర్ 2009, గురువారం

నేను చేసిన వర్కులు 2.

క్రిందవి రెన్డూమాపాప పరికిణీ మీదకుట్టినవి.
పైది ఫాబ్రిక్ పైంటింగ్. ఎప్పుడో పెళ్లి కాక ముందు ఫాబ్రిక్ పైంటింగ్ నేర్చుకున్నాను .నాకు ఆర్టు అంటే ఇష్టం కానీ ,నేర్చుకోవడము కుదరలేదు .మాకు దగ్గరలో నేర్పే వాళ్లు ఉండరు. ఆ ఇష్టము తో నే ఫాబ్రిక్ పైంట్ నేర్చుకున్నాను .ఎప్పటికైనా బొమ్మలు వేయడము నేర్చుకోవాలని నాకోరిక .









8, డిసెంబర్ 2009, మంగళవారం

చీరల మీద నేను చేసిన వర్కులు .

నాకు చీరల మీద వర్క్ లు చేయడం చాలా ఇష్టమైన హాబి .నేను డిగ్రీరెండో సంవత్సరము చదివేటప్పుడు మా హాస్టల్ లో కొంతమంది కుట్టేవారు .వాళ్ల వద్ద నేర్చుకొని మొట్టమొదటి సారిఒక చీర మీద కుట్టేను .అందరూ బాగా కుట్టేవు అన్నారు .అలా మొదలుపెట్టి కొత్త కుట్లు అన్నీనేర్చుకొని కుట్టడం మొదలు పెట్టాను
ఇమద్య ఒకావిడ మగ్గం వర్కులు నేర్పుతుందని తెలిసి ఆవిడను మాఊరు రప్పించి కొంతమందిమి కలిసి నేర్చుకొన్నాము .ఒక దాని మీద అయ్యాక ఒకదాని మీదఎప్పుడూ కుడుతూ ఉంటాను .మాపాప పరికినీల మీద కూడాకుడతాను
ఇవినాకు ఇష్టమైన వాటిలో కొన్ని .మిగిలిన వాటితో తరువాత టపాలో కలుద్దాము .


6, డిసెంబర్ 2009, ఆదివారం

టెస్ట్ క్రికెట్ లో భారత్ నెంబర్ 1



టెస్ట్ క్రికెట్ లో మనభారతదేశం " ప్రపంచ నెంబర్ వన్ "అయ్యింది .

శ్రీలంక తో జరిగిన మూడో టెస్ట్ లో మన దేశం ఇన్నింగ్స్ ఇరవైనాలుగు పరుగులతో గెలుపొంది భారతదేశ చరిత్ర లోనే మొదటిసారి ప్రపంచ నెంబర్ వన్ అయ్యింది .మూడు టెస్టు ల సిరిస్ లో రెండింటి లో గెలుపొంది ఈ ఘనత సాధించింది.

ఈ గెలుపు తో నూటఇరవైనాలుగు రేటింగ్ పాయింట్లు పొంది మొదటి స్థానాన్ని పొందింది.

ఈ విజయాన్ని సాధించిన మన జట్టుకి" శుభాకాంక్షలు ".

3, డిసెంబర్ 2009, గురువారం

చిలకమ్మల కబుర్లు .




అబ్బ వీళ్ల జామ చెట్టుకి కాయలు చాలా ఉన్నాయే ... ఈ మధ్య కోతులు రాలేదో యేమిటో.. అనుకొంటూ ఒక చిలుకమ్మ మాజామ చెట్టు మీద వాలిందితొందరగా తినెయ్యాలి.ఎవరైనా వస్తారు .


అబ్బ చాలా రుచిగా ఉంది ఈకాయ.ఎవరైనా చూస్తే కొట్టేస్తారు .అమ్మో ..అవిడ చూసేసింది.అదేమిటి కర్ర తెస్తుందనుకొంటే ,కెమేరా తెచ్చింది . అనుకుంది. ఓయ్ ...తొందరగా నువ్వు కూడా రావే ,ఆవిడ మనకు ఫొటో తీస్తుంది.అనుకొంటూ ఇంకో చిలుకమ్మను కూడా పిలిచింది .

ఎలా ఉన్నామంటావు ఫొటోలో ,అని ఒక చిలుకమ్మ ఇంకొక చిలుకను అడిగింది . మనకేం సూపర్ గా ఉంటాము.ఇంకా వాళ్ళే ఫొటో తీసుకోవడానికి మేకప్పై ,లిప్స్టిక్కులూ గట్రాలూ పూసుకుంటారుఅని ఇంకో చిలుక అంది.

మాజామ చెట్టు మీద రోజూ చిలుకలువాలి జామకాయలన్నీ తినేస్తాయి. వాటిని చూస్తూ సరదాగా అవి ఇలా అనుకొంటే ఎలా ఉంటుంది అని ఊహించి వ్రాసాను. ఎలాఉందో చెప్పండేమరి.

26, నవంబర్ 2009, గురువారం

బహుళ కావ్యములను .....

యోగి వేమన మనకు ఉపయోగపడే ఎన్నో విషయాలను తన పద్యాల ద్వారా తెలియజేసాడు .అందులో ఒకపద్యమిది .
బహుళ కావ్యములను బరికింపగావచ్చు
బహుళ శబ్ద చయము బలకవచ్చు .
సహన మొక్కతబ్బజాల కష్టంబురా
విశ్వదాభిరామ వినురవేమ .
బావము. ...
ఎన్నికావ్యాలైనాచదవవచ్చు .ఎన్నిభాషలైనా మాట్లాడవచ్చు .కానీఓపిక కలిగి ఉండడం చాలా కష్టం .ఓపిక లేనప్పుడు ప్రతీ చోటా మనిషి కోపతాపాలకు గురి అవుతాడు .కోపం మనిషి ఆలోచనను దెబ్బతీస్తాది .చదువుకున్నదంతాఎందుకు కొరగాకుండా పోతుంది .అందుకే మిగతా విద్యా బుద్దులు నేర్చుకోవడము తో పాటు ఓపికను కుడా పెంపొందించుకోవాలన్న నీతినిఈ పద్యం చెబుతుంది .

22, నవంబర్ 2009, ఆదివారం

సుబ్రహ్మణ్య స్వామి షష్టి .

ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి షష్టి .మాజిల్లాలో అత్తిలి లోను ,చాగల్లు లోను షష్టి ఉత్సవాలు (నాకు తెలిసినవి .) బాగాజరుగుతాయి .మాచిన్నప్పుడు మాఊరు లో సుబ్రహ్మణ్య స్వామి గుడి లేక మేమంతా మాకు దగ్గరలో యాదవోలు అనే ఉరు వెళ్ళేవారము. అక్కడ బాగా జరుగుతుంది. మేము ప్రొద్దుటే ట్రాక్టర్ వేయించుకొని వెళ్లి స్వామిని దర్శించుకొని ,దుకాణాలు చూసుకొని మద్యాహ్నానికి వచ్చేవాళ్లము .ఫేమస్ వెంకటరమణ కొత్త సంవత్సరపు కేలండర్ లు ముందు షష్టి దుకాణాల లోకే వస్తాయి .



ఇప్పుడు మాఊరు శివాలయము లోసుబ్రహ్మణ్యస్వామిని ప్రతిష్టించారు.ఉదయమే వెళ్లి స్వామిని దర్శించుకొని వచ్చాను .
ఆస్వామి అందరికీ ఆయురారోగ్యాలు ,సుఖ సంతోషాలు అందించాలని కోరుకుంటున్నాను.

15, నవంబర్ 2009, ఆదివారం

టమాటా,మిరపమొక్కలు.

టమాటాలను మనం ఇంచుమించు అన్నికూరలలోనూ వాడతాము.కొద్దిగా శ్రద్ద పెడితే మనమే ఇళ్ళకాడ కుండీలలో టమాటా మొక్కలును పెంచుకోవచ్చు.
టమటాలను ముక్కలు కోసేటప్పుడు,వాటిలో గింజలను ,ఒకనీళ్ళగిన్నె లోకి తీసుకోవాలి.ఆనీళ్ళను పూల కుండీలో పోస్తే మూడునాలుగు రోజులలో చిన్నచిన్న మొలకలు వస్తాయి .వాటిని జానెడు పొడవు అయ్యే వరకూ ఆకుండీలోనే వుంచి తరువాత వేరే దానిలో వేసుకొంటే రెండునెలలో కాయలు కాస్తాయి .మనము సొంతముగా పండిచిన కూరగాయలతో వండుకొంటే ఎంత తుత్తి గా ఉంటుందండి.
అలాగే మిరపమొక్కలు కూడాపెంచవచ్చు. ఎండుమిరపకాయల డబ్బా కాళీ ఐపోయాక దానిలో అడుగున గింజలు ఉంటాయి .వాటిని పాడేయకుండా పూలకుండీలో వేస్తే మొక్కలు లెగుస్తాయి .వాటిని కొద్దిగా పెరిగాక వేరే కుండీలోవేస్తే అవికూడా రెండు ,మూడునెలలోనే కాపుకొస్తాయి.

14, నవంబర్ 2009, శనివారం

మేము ...మా వనభోజనాలు .


మేము గత మూడేళ్ళ నుండి ప్రతి సంవత్సరము వనభోజనాలు ఎవరో ఒకరిపోలములో పెట్టు కొంటున్నాము .ఇప్పుడు మా కొబ్బరితోటలోపెట్టుకొన్నాము .అంతా కలసి ఓయాభైమందయ్యాము .

మేము (అంటే నేను , రజనిఅని నాకజిన్ ,మాకు అత్తగారు అవుతుంది ( కానీచిన్నదే )రత్నం అని తను ,)ముగ్గురమే అన్నీ చూసుకొన్నాము. ముందు రోజు రాత్రిపనస పొట్టుకూర ,కొత్తిమీర పచ్చిచింతకాయపచ్చడి చేసేసుకొన్నాము.( పనసపొట్టుకూర మరునాడుకి వూరి బాగుంటుంది.).అలాగే మిగతా కూరగాయలు అన్నీసిద్దము చేసుకొన్నాము.


ప్రొద్దుటే వంటమనిషి ,నలుగురు సాయం చేసేవారు వెళ్లి ,మేము అందరమూ వెళ్ళే టప్పటికి వంటకానిచ్చేసారు. ఆరోజు మా మెనూలో ఇంకా యేమిటంటే ...దొండకాయ వేపుడు , కాలీఫ్లవర్ చిక్కుడు ,గుమ్మడికాయదప్పలము, పప్పు ,వుసిరికాయ పచ్చడి .స్వీట్ పాలతాలికలు ,హాట్ పచ్చిమిరపకాయ బజ్జి .

ఇక,మాకు పనేమి లేదు .మేము వెళ్లిన వారిని పెద్దవాళ్ళు ,పిల్లలుగా విడదీసి వారినందరినీ ,మ్యూజికల్ చైర్స్ ,స్పూన్లో నిమ్మకాయ ఆటలు ఆడించాము (మేము కూడా ఆడాము అనుకొండి.) .పెద్దవాళ్ళు అలవాటులేక మేము ఆడము అన్నారు కానీ ఎలాగో ఆడించేసాము .

మేము అందరమూ ఆడవాళ్లమే వెళ్లాము .కావాలనే వెళ్ళాము.మగవాళ్ళు వుంటే సరిగా ఆటలుఆడరు,సిగ్గుపదతారని.. కడుపులో ఎలుకలు పరిగెట్టేవరకూ అలా ఆడుతూనే వున్నాము. కాసేపటికి అందరికి సిగ్గు ,బిడియమూపోయి లైన్లో పడ్డారు. తరువాత కబాడీ ,కో కో ఇలామాయిష్టమొచ్చిన ఆటలన్నీ... అలసిపోయేవరకూ ఆడుతూనే వున్నాము. టైము కూడాతెలియలేదు .అసలే సీతాకాలము కదా ,ఐదున్నరకే చీకటిపడిపోయింది.అందరమూ చాలాబాగా గడిపాము. అందరూ... అప్పుడే వెళ్ళిపోదామా ,ఇంకా కాసేపు ఉందాము అని అంటే అలా అలా ఆరింటివరకూ ఉండిపోయేము .

ఇలా ఆటపాటలతో , ఒక్కకార్తీక వనబోజనా లప్పుడే ఎందుకు గడపాలి ,నెలకో రెండునెలలకో పెట్టుకోవచ్చుకదా అనిపించింది. పెద్దవాళ్ళు ఎప్పుడూ ఏదోఒక పని తో బిజీ గావుంటారు .ఇలాపెట్టుకొంటే వాళ్ళకి కాస్త సరదాగా ఆట విడుపుగా ఉంటుందికాదా ...

ఇవండి మరి మా వనభోజనాల విశేషాలు..

బుల్లిపిట్ట ..బుజ్జిపిట్ట ...




4, నవంబర్ 2009, బుధవారం

పంటినొప్పికి ఇంటిమందు .

పిప్పిపళ్ళ వలన కానీ చిగుళ్ళలో ఇన్ ఫెక్షన్ వలనగానీ ఒక్కొక్కసారి పంటినొప్పి ఎక్కువగా వస్తుంది. అటువంటప్పుడువెంటనే వైద్యుడివద్దకు వెళ్ళటం కుదరకపోతే ఇంటిలో ఉన్న వాటితోనే కొన్ని చిట్కా మందులు చేసుకొని వాడవచ్చు. నొప్పిగా ఉన్న చోట ఉల్లిపాయముక్కను కోసి పెట్టవచ్చు . ఐసుముక్కను గుడ్డలో పెట్టి నొప్పి ఉన్న చోట పెడితే నొప్పి తగ్గుతుంది . లవంగనూనె,వెల్లుల్లి కూడా వాడవచ్చు .ఉప్పునీటిని పుక్కిలించి ఊసినా మేలు కలుగుతుంది .వెనిల్లా ఒకటి రెండు చుక్కలు నెప్పిగా ఉన్నచోట వేయవచ్చు .ఇంకా చిన్న అల్లం ముక్క తీసుకొని బాగా నమిలినా బాధ కొద్దిగా తగ్గుతుంది . ఇంగువలో నిమ్మరసం కలిపి దానిలో ముంచిన
దూదిని పంటిపైన పెట్టుకుంటేకూడా నొప్పితగ్గుతుంది.

3, నవంబర్ 2009, మంగళవారం

అందినద్రాక్ష పుల్లన .


అదేంటి ,అందిన ద్రాక్ష పుల్లన అంటున్నాననుకొంటున్నారా ....... అసలుకదేమిటంటే..మా ప.గో.జిల్లాలో వారికి అసలుద్రాక్షపాదులు ఎలా ఉంటాయోతెలియదు.అటువంటిది ఈమధ్యన అందరూ కడియం నర్సరీ(మాకు కడియం నర్సరీ లు బాగా ఫేమస్) నుండి ద్రాక్ష పాదు లు తెచ్చి ఇళ్ల వద్ద పెంచుతున్నరు .అది చూసి మేము కూడా ఒకటి తెచ్చివేసాము .కొన్ని రోజులకి అది బాగాపెరిగింది .పూత కూడా బాగా వచ్చి గుత్తులు గుత్తులుగా కాయడం మొదలుపెట్టింది .ఇక మేము అవి ఎప్పుడు పండుతాయా ,యెప్పుడు తిందామా అని యెదురు చూస్తూఉన్నాము. మేము ఎదురు చూస్తున్నరోజు రానే వచ్చింది .చాలా ఆత్రంగా తయారైన గుత్తులన్నీ కోసేసేము .తీరా తిందామనినోట్లో పెడితే పుల్ల పుల్లగా వగరుగా ఉన్నాయి.అప్పుడు అనుకొన్నాము ,అందిన ద్రాక్ష కూడా పులుపేనని. . అప్పటి నుండి వాటిని యేమి చేయాలో తెలియక వాటితో పప్పు చారు కాస్తున్నము .నిజమండిబాబు. పచ్చి గుత్తులను కోసి కాయలను ఉడకబెట్టినీళ్ళు పిండి పప్పు లోవేసి ,ఉప్పు కారం వేసి ఉడికిస్తే ... ద్రాక్షకాయలతో పప్పుచారు రెడీ . . ఎలాఉందండి మాద్రాక్షకాయల పప్పుచారు.... .

2, నవంబర్ 2009, సోమవారం

బ్లాగ్ వనంలో వనభోజనాలు -గుమ్మడికాయ దప్పళం .

మా వైపు ఫంక్షన్లలో ఎక్కువగా గుమ్మడికాయ దప్పళం వండుతారు.
దీనికీ కావలసిన పదార్దాలు ...
గుమ్మడికాయ -చిన్నది ఒకటి .
ఉల్లిపాయలు -రెండు .
పచ్చిమిర్చి -ఆరు
బెండకాయలు -పది .
టమాటాలు -మూడు .
ములక్కాడ -ఒకటి .
వంకాయలు -రెండు .
కొత్తిమీర-ఒకకట్ట .
పోపు పెట్టుకోవడానికి ..
మెంతులు -అర స్పూను
ఆవాలు -అరస్పూను
జీలకర్ర -అరస్పూను

ఎండుమిరపకాయలు-నాలుగు.కరివేపాకుకొద్దిగా .
చింతపండు కొద్దిగా .
బెల్లం కొద్దిగా .
తయారుచేసేవిదానం .....
..
స్టవ్ మీద గిన్నె పెట్టి వెలిగించి దానిలో నీరు పోసి,గుమ్మడికాముక్కలువేయాలి .అవి ఉడుకుతుండగా , ముక్కలుగాకోసుకొన్న కూరగాయముక్కలు దానిలోవేయాలి. ఉల్లిపాయలను చీరికలుగా కోసుకోవాలి.అవి, పచ్చిమిర్చి ముక్కలులుకూడా వేసుకోవాలి .కొద్దిగా వుడికాక ,కారము ,ఉప్పు ,పసుపు వేసుకొని,చింతపండుపులుసు ,బెల్లముకొద్దివేసుకోవాలి.కాసేపు ఉడికేక స్టవ్ కట్టేసుకొని తాలింపు పెట్టుకొని ,కొత్తిమీర జల్లుకోవాలి .

దీనిని ముద్దపప్పులొకలుపుకొని తింటే ఉంటుందీ ..........

పపపపప్పు ..దప్పళం ......వేడి వేడి అన్నం మీద....కమ్మనిపప్పు కాచిన నెయ్యి ...కలిపితే ..భొజనం వనభొజనం ......

30, అక్టోబర్ 2009, శుక్రవారం

మా ఊరు ..

మాఊరి పేరు గాంధీనగరం .
మాఊరి కి ఒక చిన్న చరిత్ర వుంది .ఇప్పుడు మాఊరు చోట ,మాతాతగారినన్నాగారు వాళ్ళకి పొలాలు వుండేవట . రోజూ ఇక్కడకు వచ్చి వ్యవసాయం చేయించేవారట .మా ఊళ్ళో ఒక చెరువు ఉంటుంది.వర్షాకాలములో ఆచెరువునిండి బాగాపొంగి పొర్లుతావుండేదట.ఒక్కొక్కసారి పొలాల్లోకి వెళ్ళినవారు రెండు ,మూడు రోజు లవరకూ ఇళ్లకు వెళ్లడానికి లేకుండా ఇబ్బంది పడేవారంట .ఇక్కడ పొలాలు ఉన్న నాలు కుటుంబాల వారు ఈ ఇబ్బందులు పడలేక ఇక్కడే ఉండి వ్యవసాయం చేయాలనుకొని గ్రామాన్ని యేర్పరుచుకొన్నరు .

అవి స్వాతంత్ర్య పోరాటం జరిగే రోజులవటముతో" గాంధీనగరం"అని పేరుపెట్టేరట.

అలా మాఊరు" పంతొమ్మిదివందలముప్పైఎనిమిది "లో యేర్పడిందనమాట .ఆనాలుగు కుటుంభాల వారి పిల్లలు ,మనుమలే మాఊరిజనాబా .మాఊరిజనాబా రెండువందలకంటే ఎక్కువుండదు . అందరూ ఒకరికొకరు దగ్గరివాళ్ళకే పెళ్ళిళ్ళుచేసుకోవడముతో ఊరిలో పెళ్ళైనా ,పేరంటమైనా అందరూ కలసి మెలసి చేసుకొంటాము .

22, అక్టోబర్ 2009, గురువారం

పోషకాలు మెండుగా వుండే శ్రీ ఫలం .

కొబ్బరికాయను అందరూ శుభప్రదముగా భావిస్తారు. మనదేశములో శుభకారార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి.కొబ్బరికాయ లేని పండుగ లేదంటే అతిశయోక్తి కాదు.కేరళీయులకైతే రోజూ అన్నింటిలోనూ కొబ్బరికాయ ,కొబ్బరినూనె తప్పనిసరిగా వుండి తీరవలసినదే .వారి ఆరోగ్యమూ ,సంపదా కొబ్బరిపంట మీద అదారపడివున్నాయి .కోట్లాదిమంది జనం కొబ్బరిపంటనే జీవనాదారం చేసుకుని వుంటున్నారు .
కొబ్బరికాయలో నలబైతొమ్మిది శాతం లారిక్ యాసిడ్ వుంటుంది .ఇది తల్లి పాలకు దాదాపు సరిసమానం అంట. కొబ్బరినూనెలో వుండే పాటియాసిడ్స్, వైరల్ ,ఫంగల్ ,బ్యాక్టీరియల్ వంటి మానవజాతి ఎదుర్కునే రుగ్మతలను తగ్గించడములో సహాయపడతాయి. పోషకాలతో కూడిన ఆహారాన్ని ,పానీయాన్ని అందిచడముతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది .కొబ్బరిచెట్టు లో ప్రతీ భాగము అన్నిరకాలగాను ఉపయోగపడుతొంది .అందుకే దీనిని మానవుల పాలిట కల్పవృక్షము అంటారు .
మీకు తెలుసా ? కొబ్బరికాయకు కూడా ఒక రోజు ఉందని .అదే ప్రపంచ శ్రీ ఫల దినోత్సవము (కోకోనట్ డే)ప్రతీ సంవత్సరము సెప్టెంబర్ రెండు న జరుపుతారు .

కార్తీకవనభోజనాలు

ప్రకృతితో భంధాన్ని ఏటా గుర్తు తెచ్చేదే కార్తీకమాసం .ఈమాసంలో పేద దనిక తేడాలు లేకుండా ఊరంతా కలసి వనాలలో సామూహిక భోజనాలు చేయడం మన సంప్రదాయం.పిల్ల పాపలు పెద్దల తో కలసి ఆడి పాడి సంతోషాన్ని పంచుకొంటారు .


కార్తీకమాసములోనే వనభోజనాలకు ఎందుకు వెళతారంటే - వర్షాకాలము తరువాతే ఈ మాసము వస్తుంది కాబట్టి వనాలన్నీ పచ్చగా వుంటాయి .అందరిలోనూ వుత్సాహము వెల్లి విరుస్తుంది . పల్లె వాసులంతా ఊరికి దగ్గరలో వున్న వనాలకు వెళ్లి ..సహపంక్తి భోజనాలు చేస్తారు .భోజనములో రుచికంటె ,అందరం ఒక చోట కలిసామన్న అనుభూతి మరింత ఆనందాన్నిస్తుంది .ఎలాంటి అడ్దుగోడలు లేకుండా ,బేషజాలకు పోకుండా ఈకార్యక్రమములో పాల్గుంటారు .ఆట,పాటలతో రోజంతా వుత్సాహంగా గడుపుతారు.

ముక్యం గా రావి వుసిరి చెట్ల కింద భోజనాలు ఎందుక చేస్తారంటే ప్రకృతి తో మనిషికున్న బంధాన్ని గుర్తు చేసేందుకు. కలసి భొజనము చేయడములో వున్న సంతృప్తి, ఆనందము దేనిలోను వుండదు కుటుంభం,గ్రామం ,సమాజము వీటన్నింటినీ పటిష్టమంగా వుంచేవి అనుబంధాలే... . అలాంటి బంధాలకు బలాన్ని అందించే దివ్యౌషదం వనభోజనాలు .

16, అక్టోబర్ 2009, శుక్రవారం

దీపావళి శుభాకాంక్షలు


దీపావళి పండుగ లో ఒక ప్రత్యేఖత ఉంది .దుష్టశిక్షణ ద్వారా జనవళికి శాంతిని ప్రసాదించిన పర్వదినం.దీపాలువెలిగించి ,ఇంటింటినీ అలంకరించుకొని పెద్దలుతమసంతొషాన్ని ప్రకటిస్తారు.పిల్లలు బాణాసంచా కాల్చి తాము వినోదించడమే కాక చూపరులందరినీ ఆనందపరుస్తారు . ఎన్నిపండుగలు వున్నా, దీపావళి కి సాటి రాగల వేడుక మరొక దానికి లేదు . టపాసులు కాల్చేటప్పుడు చిన్నపిల్లలతో జాగ్రత్త .
అందరికీ దీపావళి శుభాకాంక్షలు .

9, అక్టోబర్ 2009, శుక్రవారం

పశ్చిమావని ...సిరులగని

ఎటుచూసినా పచ్చదనం ..పైటేసిన పడుచులా మాగాణి భూముల్లొ పైరుపచ్చని పంటలు ,గోదావరి పరవళ్ళు , ఉరకలు వేసే పంట కాల్వలు, అప్పుడప్పుడు,ఆగ్రహించినా ఎల్లప్పుడూ గోదారమ్మ చల్లని చూపులతో డెల్టా భూముల్లో పండే సిరులు ,పుష్కలమైన జలవనరులు ,వాణిజ్య పంటలతో కళకళలాడే మెట్ట పొలాలు ,అడవితల్లి ఒడిలో సేదదిరే గిరిజనం ,అటు సాగరతీరం ,ఇటు ఎత్తైన పాపికొండలు ,కనువిందు చేసే తుర్పుకనుమలు ,ఇదే ..ఇదే మాపచ్చని పశ్చిమ గోదావరి .


సాదరంగా ఆహ్వానించే మనస్తత్వం ,ఆప్యాయంగా పలకరించి ఆదరించే మంచితనం ,వచ్చినవారిని అన్ని రుచులతో మైమరపించే మంచితనం.. అందుకే గోదావరివాసులంటే అందరి లోను ప్రత్యేకత .


ఎందరో మహానుభావులు, తెలుగు సాహిత్య చరిత్రకు వన్నెతెచ్చిన చిలకమర్తి ,కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన దేవరకొండ బాలగంగాధరతిలక్ ,మన్యంవీరుడు అల్లూరిసీతారామరాజు ,గ్రందాలయోద్యమానికి బాటలు వేసిన ఎందరో మహానుబావులు ,స్వాతంత్రం కోసం ప్రాణాలొడ్డి,కారాగారాలకు వెళ్ళిన మరెందరో సమరయోదులు , సినీ పరిశ్రమలో మెగాస్టార్ , దర్సకరత్న దాసరి,కోడిరామకృష్ణ ,వంటి ఉద్దండులు,దర్సకులు,సాంకేతికనిపుణులు,సగర్వంగాచాటే చరిత్రకు సువర్ణాక్షరాలు వీళ్ళు. పశ్చిమావనికి ఇది ఎనబైమూడవ వసంతం .బౌగోళికంగా ,సామాజికంగా ,చారిత్రకంగా పశ్చిమావని ఇన్ని విజయలు సొంతం చెసుకొందంటే ఆ ఘనత ముమ్మటికీ మనది ,మనముందుతరాలవారిదే .

28, సెప్టెంబర్ 2009, సోమవారం

విజయదశమి శుభాకాంక్షలతో

దశమిరోజున తప్త కాంచనకాంతితో ,కోటిసూర్య సన్నిభమైన ప్రభాజాలముతో,రత్నభూష భూషితమైఅలరారుతారు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి.సర్వ మానవ జీవితాలలో సర్వశక్తికి కేంద్ర స్థానం జగజ్జననే .అడ్డంకులను ఎదుర్కునే శక్తిని ,లొక కళ్యాణ కార్యాలలో విజయాన్ని ప్రసా దించమని ఆ తల్లిని స్వచ్చమైన మనసుతో వేడుకుంటె ఆమె సహ్రుదయ స్వరూపిణియై అశీర్వదిస్తుంది .దసరా పేరుతో మనం జరుపుకొనే విజయదశమి చెడుపై విజయానికి ప్రతీక .

అందరూ సఖ సంతోషాలతో ,అయురా రోగ్యాలతో వుండాలని ఆశిస్తూ అందరికీ ,
దసరా శుభాకాంక్షలు


23, సెప్టెంబర్ 2009, బుధవారం

తొమ్మిది రోజుల ఉత్సవాలు

ఆశ్వయుజ మాసం లో వచ్చే అమావాస్య తరువాతి రోజున నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి .తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పండుగల సంబరాలు చివరిరొజూ ,పదవరోజైనవిజయదసమిరోజునలేదా దసరా రోజున ముగుస్తాయి .
ఈతోమ్మిది రోజులూ అమ్మ రకరకాలుగా దర్సనమిస్తుందని

పెద్దల విశ్వాసం .మొదటిరోజు బాల, రెండోనాడు లలిత ,మూడోరోజు తరుణి, నాలుగోనాడు సుమంగళి ,ఐదవరోజు సతేక్షి ,ఆరోనాడు శ్రివిద్యారుపిని ,ఏడూ రోజు మహాదుర్గ ,ఎనిమిదో రోజు మహాలక్ష్మి ,తొమ్మిదోరోజు సరస్వతి ,పదవరొజున శివశక్తి ఐక్యరుపిని .
కొలువుగా బొమ్మలను తీర్చిన ప్రతి ఇంటిలోనూ ఈ తొమ్మిదిరోజులు, ఇళ్ళకు వచ్చిన అందరికీ తాంబూలం ,దక్షిణ ,నైవేద్యవస్తువులు తప్పకుండా ఇవ్వాలి .తోమ్మిదిరోజులుపూజలు చేయలేని వారు చివరి మూడు రోజులైన సప్తమి ,అష్టమి ,నవమి రోజులలోనైనా చేసుకుని ,విజయదసమి రోజున ముగించాలి ..చదువులతల్లి అయిన శ్రీసరస్వతీ పూజ రోజున పుస్తకాలు ,సంగీతవాయిద్యాలు ,పనిముట్లు పూజలో పెట్టాలి .మరునాడు విజయదసమి రోజున పుజతరువాత తీయాలి .ఆయా వృత్తులవారు తమ గురువులను పూజించి ,వారికి గురుదక్షిణలిచ్చి కోలుచుకోవాలి .వారి దీవెనలు అందుకోవాలి .క్రొత్తవృత్తుల ప్రారంభానికి విజయదసమి అత్యుత్తమమైనది .ఆరోజు రాత్రి బొమ్మలకు పాలనైవేద్యము సమర్పించి ,బొమ్మలను పడుకోబెట్టాలి .మరునాడు వాటిని తీసి ,మరుసటి సంవత్సరం దేవికి స్వాగతం చెప్పేందుకు సిద్దం కావాలి .

14, సెప్టెంబర్ 2009, సోమవారం

గాలివానలో ......


అప్పుడు ఎనిమిదోవతరగతి చదువుతున్నాను .మా ఉరిలో స్కూల్ లేకపోవడముతోమా ప్రక్క ఉరిలో బడికి రోజు నడచి వెళ్ళేవారము .(ఇప్పుడు కూడా లేదు ).నేను ఆరవతరగతిలోచేరేటప్పటికి చాలామంది వుండేవారు .నేను ఎనిమిదోతరగతికి వచ్చేటప్పటికి చాలమంది పదవతరగతి ఐపోయిమానేసారు . ఆడపిల్లలము ముగ్గురుమే వుండేవారము .ఆరోజు ఎవ్వరూ రాలేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను .మబ్బుమబ్బు గా వుండి కొద్దిగా వర్షం కూడాపడుతుంది . వర్షం పడుతున్నదని బడికి మద్యాహ్నము నుండి సెలవు ఇచ్చారు .ఇంటికి బయలుదేరాను. కొంచెం దూరము వచెటప్పటికిబాగా మబ్బుపట్టి గాలివాన రావటం మొదలైంది .నాకు బయ్యం వేసి దేవుడుని తలచుకొంటూ తొందర తొందరగా నడుస్తున్నాను .దారి లో ఒక చెరువు వుంటుంది . దానిలోకి ఉరిలో కురిసిన వర్షము నిరు చేరి అది పొంగి పోర్లుతున్నది. దానితో ఏమి చేయాలో తెలియక భయ్యం తో బిక్కమొఖం వేసుకొని నుంచున్నాను (గొడుగు వుందిలెండి ).ఇంతలొ పోలాలనుండి ఇళ్ళకు వెళ్ళే కూలీలు చూసి వారితోపాటు నన్నుకూడా చెరువు దాటించారు .ఎలాగో ఇంటికి వచ్చాను. ఆదెబ్బతో తొమ్మిదో తరగతి లో స్కూల్ మార్పించేసారు .తొమ్మిది ,పది మా మావయ్య గారి ఇంటి వద్ద నుండి వెళ్లి చదువుకున్నాను .ఇది జరిగి చాలా ఏళ్ళు ఐనా గాలివానా వస్తే అదే గుర్తుకోస్తాది .

11, సెప్టెంబర్ 2009, శుక్రవారం

సెల్ తో చెర్మానికి ముప్పు .

ఈమద్యకాలంలో సెల్ ఫోన్ లేని చెయ్యే కనిపించడం లేదు. పిల్లలు నుంచి పెద్దల దాకా సెల్ ఫోన్ కి బాగా అలవాటు పడిపోతున్నారు
కూరలు అమ్మే వారి దగ్గర నుంచి పాలేరు వరకూఅందిరి వద్దాసెల్ ఫోన్ లే వుంటున్నాయి .
ఫోన్ ను ఎంతగా వాడితే అంతగా చెర్మానికితిప్పలు తప్పవు అంటున్నారుపరిసోదకులు .చాలా సెల్ ఫోన్ హ్యాండ్ సెట్లలో కనిపించే నికిల్ చర్మ సంభందిత వ్యాధుల కు కారణం కాగలదని,దీని వల్ల మొబైల్ ఫోన్ డేర్మ టైట్స్ అనే చర్మ సమస్య తలేతే అవకాసం వుంది అని బ్రిటిష్ చర్మ నిపుణులు అసోసియేషన్ హెచ్చరించింది.
బుగ్గలు,చుబుకం,చెవులు పై రాష వస్తుందనిచర్మ నిగారింపు కూడా దెబ్బ తింటుందని వారు పేర్కొన్నారు .ఫోన్ లలో నికిల్ వాడకాన్ని గురించి తయారిదార్లను అరా తీసి మరీ కొనాలని వారు సూచిస్తున్నారు .
కనుక సెల్ఫోన్ వాడేవారు జాగ్రత్తమరి .


9, సెప్టెంబర్ 2009, బుధవారం

రోజాది ఐరెన్ లెగ్గా ?

రోజా తెలుగుదేశం లోచేరిన కొన్ని నెలలకు చంద్రబాబునాయుడు మందుపాతర ప్రమాదం లో బ్రతికి బయట పడ్డాడు .ఇప్పుడు కాంగ్రెస్స్ లో చేరటానికి రాజసేకరరెడ్డి ని కలిసింది .
ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు .
పాపం రోజా పని ఐపోయింది .ఇప్పుడు రోజా ఏమీచేయలేదు .చంద్రబాబుని విమర్శించినందుకు రాజీనామాఇవ్వకతప్పలేదు .ఇప్పుడు కాంగ్రెస్స్ లో తనను ఎవ్వరూపట్టించుకోరు .మహిళాకాంగ్రెస్ అద్యక్షురాలు గంగాభవాని ని రోజా చాలా విమర్సించింది. తను చాల వ్యతిరేకిస్తుంది .చూడాలి మరి రోజా ఏమి చేస్తుందో .

3, సెప్టెంబర్ 2009, గురువారం

మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి మరణము చాలా భాద కలిగిస్తున్నది
అందరికి నా సానుబూతితెలియజేసుకుంటున్నాను .

25, ఆగస్టు 2009, మంగళవారం


అందరికీవందనాలు. నన్ను కూడా మీ బ్లాగ్ లోకములో సభ్యురాలు గా చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నాను . .